T20 World Cup: నమీబియాపై పాక్ ఘన విజయం.. సూపర్–8లోకి ఎంట్రీ!

T20 World Cup: నమీబియాపై పాక్ ఘన విజయం.. సూపర్–8లోకి ఎంట్రీ!

T20 World Cup: భారత్ జట్టు చేతిలో ఘోర ఓటమి తర్వాత టీ20 ప్రపంచకప్‌లో నిలవాలంటే తప్పనిసరిగా గెలవాల్సిన పరిస్థితిలో ఉన్న పాకిస్థాన్ ఇవాళ (ఫిబ్రవరి 18న) నమీబియాతో జరిగిన మ్యాచ్ లో ఘన విజయం సాధించింది. ఏకంగా 102 పరుగుల తేడాతో గెలిచింది. నమీబియా జట్టుని 17. 3 ఓవర్లలోనే పాక్ బౌలర్లు ఆలౌట్ చేశారు. టాస్ గెలిచిన పాక్ తొలుత బ్యాటింగ్‌లో దూకుడుగా ఆడుతూ భారీ స్కోర్ నమోదు చేసింది. ఈ మ్యాచ్‌లో చెలరేగిన సాహిబ్జాదా ఫర్హాన్ సెంచరీ కొట్టాడు. పాక్ కెప్టెన్ సల్మాన్ అఘా(38) షాదాబ్ ఖాన్ (36) మంచి ఇన్నింగ్స్ ఆడారు. ఒక దశలో పాకిస్థాన్ 200కి పైగా స్కోర్ చేస్తుందనేలా కనిపించినా, చివరికి నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 199 పరుగుల వద్ద ఇన్నింగ్స్ ముగిసింది.

పాకిస్తాన్ ఇచ్చిన లక్ష్య ఛేదనతో బరిలోకి దిగిన నమీబియా జట్టుకు 32 పరుగుల వద్ద సల్మాన్ మీర్జా బౌలింగ్ లో జాన్ ఫ్రైలింక్ ( 9) ఔట్ అయ్యాడు. అనంతరం క్రీజులోకి వచ్చిన జాన్ నికోల్ లాఫ్టీ-ఈటన్ (5) కూడా ఎక్కువ సేపు స్టేడియంలో నిలవలేకపోయాడు. సైమ్ అయూబ్ వేసిన బాల్ ని ఎక్స్ ట్రా కవర్ మీదుగా కొట్టి పరుగు కోసం వెళ్ళాగా.. ఫీల్డర్ ఆ బాల్స్ తీసుకుని వికెట్లపై త్రో చేయగా.. లాఫ్టీ ఔట్ అయ్యాడు. దీంతో నమీబియా వికెట్ల పతనం ప్రారంభమైంది. 43 పరుగుల వద్ద 3వ వికెట్, 49 రన్స్ వద్ద 4వ వికెట్, 79 పరుగుల వద్ద 5వ వికెట్, 81 రన్స్ దగ్గర వరుసగా 6, 7 వికెట్లు, 95 పరుగుల వద్ద 8వ వికెట్, 96 రన్స్ వద్ద 9వ వికెట్, 97 పరుగుల వద్ద చివరి వికెట్ ని కోల్పోయి ఓటమి పాలైంది.  

దీంతో నమీబియా బ్యాటర్లను వరుసగా ఔట్ చేసిన పాకిస్తాన్ బౌలర్లలో ఉస్మాన్ తారిఖ్ 4 వికెట్ల పడగొట్టగా, షాదాబ్ ఖాన్ 3 వికెట్లు తీసుకున్నాడు. మహ్మద్ నవాజ్, సల్మాన్ మీర్జా తలో వికెట్ పడగొట్టారు. కేవలం 17.3 ఓవర్లు మాత్రమే ఆడిన నమీబియా 97 పరుగులకే ఆలౌట్ అయింది. ఈ ఓటమితో నమీబియా జట్టు ఈ టీ20 వరల్డ్ కప్ టోర్నమెంట్ నుంచి నిష్క్రమించింది.